Friday, 28 April 2017

నా దగ్గర ఏమీ లేవమ్మా!

                                                                              సరస్వతి చిన్ననాటి స్నేహితురాళ్ళతో కలిసి ఒక వారం రోజులు విహారయాత్రలకు వెళ్ళింది.ఆ నేపధ్యంలో దేవాలయంలో దర్శనం చేసుకున్న తర్వాత అందరూ ఒకచోట కూర్చున్నారు.అక్కడ కోతులు బాగా ఉన్నాయి.ఒక కోతి అందరికన్నా వెనుకగా కూర్చున్నా ఆమె దగ్గరకు వచ్చి చేతికి తగిలించుకున్న సంచిపై చెయ్యి వేసి ఇవ్వమని సైగ చేస్తుంటే ఆమె నా దగ్గర ఏమీ లేవమ్మా!అని పదేపదే మాట్లాడుతుంటే ముందు కూర్చున్న వాళ్ళకి అర్ధం కాలేదు.వెనక్కి తిరిగి చూసేసరికి కోతి సంచి పట్టుకుని ఇవ్వమని భీష్మించుకుని కూర్చుంది.అందరూ సంచి ఇవ్వమనేసరికి ఇచ్చేసింది.కోతి వైనంగా సంచి జిప్ తీసి అందులో ఉన్నడబ్బు,సెల్ ఫోను తీసి పక్కన పడేసింది.ఆహారం కోసమో ఏమో?సంచి మొత్తం వెతికి అక్కడ పడేసి వెళ్ళిపోయింది.సరస్వతి స్నేహితురాలు బ్రతుకు  జీవుడా!అనుకుంటూ తనను,తన సంచిని ఏమీ చేయనందుకు సంతొషపడింది.

ఓటి మోత

                                                            మనలో చాలా మందిది నిద్ర లేస్తూనే ఉరుకులు పరుగుల జీవితం.మనం మెలుకువగా ఉన్న సమయంలో సగం గంటలు ఎక్కడ పనిచేసినా దాదాపు కూర్చుని చేసే పని.శారీరకంగా ఏ మాత్రం శ్రమ ఉండదు.జీవితం హాయిగా ఉన్నట్లే ఉంటుంది.దీని వల్ల ఏదో ఒకరోజు హృదయం ఓటి మోత మోగుతుంది.అధిక రక్త ప్రసరణ,కొలెస్టరాల్ పెరగటం,మధుమేహం ఒక్కొక్కటిగా పలకరిస్తూ చివరకు గుండె పోటు, పక్షవాతం ముప్పు పెరుగుతుంది.ఈ ప్రమాదం బారిన పడకుండా ఉండాలంటే పనిలోనే పని చేస్తూనే ఎవరికి వారే వాళ్ళకు అనుకూలంగా ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టించుకోవాలి.రోజు మొత్తంలో ఒక అరగంట శ్రమ చేసినా గుండెను కాపాడుకోవచ్చు.విరామ సమయంలో కొద్ది దూరం నడవాలి.ప్రతి పనికి ఎదుటివారిపై ఆధారపడకుండా నాలుగు  అడుగులు వేసి స్వంతంగా పని చేసుకోటం,లిఫ్ట్మె ఉపయోగించకుండా మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోవాలి.ఇవన్నీ తూ.చ  తప్పకుండా పాటిస్తే ఓటి మోత లేకుండా గుండెతోపాటు శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.

పార్శ్వ నొప్పికి....

                                                                                  రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు ద్రాక్షరసం తాగటం వల్ల పార్శ్వనొప్పి తగ్గుతుంది.రోజూ కొన్ని ద్రాక్ష పళ్ళు ఏదో ఒక సమయంలో నోట్లో వేసుకోవటం వలన నిద్రలేమి,తలనొప్పి వంటి వాటితోపాటు రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి.త్వరగా ఎముకలు గుల్లబారకుండా ఉంటాయి.తినే ముందు ఉప్పునీటిలో వేసి ఒక అరగంట నానబెట్టి శుభ్రంగా కడగటం మాత్రం మరచిపోకండి.శుభ్రంగా కడిగిన ద్రాక్ష పళ్ళు మాత్రమే తినాలి.

Thursday, 27 April 2017

అందరిలో అందంగా

                                                             ముఖంపై చర్మం నిగనిగలాడాలంటే ఏదో ఒక క్రీమ్ రాసుకోవడం కాకుండా కొన్ని పద్దతులు తప్పనిసరిగా పాటించాలి.ఆహారంలో మార్పులతోపాటు సహజ సిద్దమైన పూతలు వేసుకుంటూ నీరెండలో నడక,వ్యాయామం చేయాలి. ప్రతిరోజూ పరగడుపున కారట్,దానిమ్మ రసం తాగాలి.రోజూ తప్పనిసరిగా పది,పన్నెండు గ్లాసుల మంచి నీళ్ళు తాగాలి.ఉదయం,సాయంత్రం లేత ఎండలో కాసేపు ఉండాలి.మధ్యాహ్నం ఎండ చర్మాన్ని కాంతి విహీనం చేస్తుంది.తాజా పండ్లు,కూరగాయలు తినాలి.ఉదయం నిమ్మరసం కానీ గ్రీన్ టీ లేదా అల్లం టీ తీసుకోవాలి.ముఖానికి సహజ సిద్దమైన బొప్పాయి,కారట్,అరటి పండు,కమల,నారింజ వంటి పాక్స్ వేసుకోవాలి. వేసుకునే ముందు ముఖాన్ని చల్లటి నీళ్ళతో కడగాలి లేదా ఐసుగడ్డలతో శుభ్రం చేయాలి.ఇలా చేస్తే ముఖం నిగనిగ లాడుతూ అందరిలో అందంగా కనిపించడం ఖాయం. 

Tuesday, 25 April 2017

చల్లని తల్లి

                                                                 వేసవిలో ఉల్లి చల్లని తల్లిలా ఆదుకుంటుంది.ముక్కలు తరిగేటప్పుడు ఏడిపించే ఉల్లిపాయ వ్యాధి నిరోధక శక్తిని పెంచి వేసవిలో వచ్చే అనేక సమస్యల నుండి మనల్ని కాపాడుతుంది.రోజూ ఆహారంలో ఏరూపంలో తీసుకున్నా శరీరానికి చలువ చేసి ఆరోగ్యంతోపాటు వేసవిలో వడదెబ్బ నుండి సైతం రక్షిస్తుంది. 

చర్మం ఆరోగ్యంగా

                                                                     ఒక స్పూను దోసకాయ రసం,ఒక స్పూను నిమ్మ రసం,ఒక స్పూను గులాబీ నీళ్ళు అన్నీ కలిపి ముఖానికి రాసుకుని ఒక పది ని.ల తర్వాత చల్లటి నీటితో ముఖాన్నిశుభ్రంగా కడగాలి.వేసవిలో ఇలా చేయడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Wednesday, 19 April 2017

గొప్ప మనసు

                                                                        పార్వతమ్మ గారికి 90 సంవత్సరాలు ఉంటాయి.తల్లిదండ్రులు లేని అనాధ బాలికలకు చదువు సంధ్యలు చెప్పించడానికి,వారిని కంటికి రెప్పలా కాపాడుతూ వారి బాగోగులు చూడటానికి కొంత మంది పెద్దలు సమిష్టిగా సేవాభావంతో ముందుకు వచ్చి ఒక సమితిగా ఏర్పడి పూర్తిగా సేవకే అంకితమయ్యారని తెలిసింది.తనకు తానుగా వెళ్ళి కార్యక్రమాల్లో పాల్గొనలేదు కనుక వారిని ఇంటికి పిలిపించి తన వంతుగా పిల్లలకు ఉపయోగించమని కొంత మొత్తాన్ని అందజేసింది.కొంత మంది రెండు చేతులా సంపాదించే వాళ్ళు కూడా ఎదుటి వారికి చేతనైన సహాయం చేద్దామని అనుకోని రోజులు.అటువంటిది పార్వతమ్మ గారు సహృద్భావంతో ఆలోచించి భవిష్యత్ప్రణాళికకు ఉపయోగపడే విధంగా ఇవ్వటంతో అందరూ ఆమె కల్మషం లేని మనసును వేనోళ్ళ కొనియాడారు.ఇంతే కాక ఆమె చనిపోయిన తర్వాత వైద్య విద్యార్ధులకు ఉపయోగపడేలా తన పార్ధివ దేహాన్ని వైద్య విద్యాలయానికి ఇస్తానని సంతకాలు పెట్టి ఇచ్చింది.అక్కడికి వచ్చిన వారందరూ అమ్మా!మీ జన్మ ధన్యమైంది.మీది గొప్ప మనసు అని పార్వతమ్మ గారిని మెచ్చుకున్నారు.