Sunday 30 March 2014

ఉగాది శుభాకాంక్షలు

         నాబ్లాగ్ వీక్షించ వచ్చిన తెలుగు వారందరికి జయనామసంవత్సర ఉగాది శుభాకాంక్షలు.ఈ నూతన తెలుగు
సంవత్సరంలో భగవంతుని దయవలన  అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో  తులతూగుతూ అన్నింటా  అందరికీ విజయము చేకూరాలని మనస్పూర్తిగా  కోరుకుంటున్నాను.



Saturday 29 March 2014

అవకాశవాది

              మాలతి చదువుకున్నది కానీ లోకజ్ఞానం తక్కువ.పెళ్ళయి అత్తగారింటికి వచ్చిన కొత్తలో చూడటానికి
         వచ్చిన పెద్దవాళ్ళను పరిచయం చేసినప్పుడు అలాగే నిలబడేది.పెద్దవాళ్ళకునమస్కారం చెయ్యటం మన                సంప్రదాయం కదాఅంటే నేను మనుషులకు నమస్కారం చెయ్యను.మాఇంట్లోవాళ్ళు చెయ్యరు అనిచెప్పింది.            నాపద్దతి ఇంతే అన్నట్లు మొండిగా ఉండేది.అలా అని దేముడికి కూడా నమస్కారం చెయ్యదు.ఇప్పుడు                  ఎన్నికలలో నిలబడింది.చచ్చినట్లు ఓట్లుకోసం కనిపించిన వాళ్ళందరికీ నమస్కారం చేసి ఓట్లు అడుగుతుంది.
         ఇప్పుడు తన అవసరం కదా.ఓట్లు వెయ్యాలంటే దండాలు పెట్టాలిగా.తర్వాత సంగతి తర్వాత గెలుపో ఓటమో.            రాజకీయం తెలిసిన  అవకాశవాది.


గోడమీదపిల్లి

         సుభాష్ ఊరిలో అందరికి తలలో నాలుక లాగా అన్ని పనులుచేసి పెడుతుండేవాడు.ఎలక్షన్లు వస్తేమాత్రం
పోటా పోటీగా ఉన్న రెండు పార్టీలవాళ్ళకు ఇద్దరికీ కావల్సినమనిషి లాగా తిరుగుతుండేవాడు.ఇద్దరి దగ్గరా ఒకరికి తెలియకుండా ఒకళ్ళ దగ్గర డబ్బు తీసుకునేవాడు.చివరివరకూ గోడమీద పిల్లిలాగా కూర్చునేవాడు.చివరికి ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళకు ఓటు వేసేవాడు.రెండు,మూడుసార్లు ఈవిషయం గమనించి వీడు గోడ మీద పిల్లి వాటం ఎటు వీలయితే అటు దూకేస్తాడు అని ఇరు పార్టీలవాళ్ళు డబ్బు ఇవ్వటం మానేశారు.ఎన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పినాఎవరూ నమ్మటంలేదని నమ్మి డబ్బు ఇవ్వటం లేదని బుద్దితెచ్చుకుని ఎదో ఒకదానికే పనిచేయటం మొదలెట్టాడు. 

Friday 28 March 2014

నమ్మలేని నిజం

              రష్మితాతగారు ఒకపల్లెటూరిలో ఉండేవారు.ఆదివారాలు,సెలవులకు రష్మి,తల్లి,తండ్రి ఊరువెళ్తుండేవారు.
మామనుమరాలు వస్తుందని తెగ హడావిడి చేసేవాళ్ళు.వరండాలో ఉయ్యాల వేయించేవాళ్ళు.పొలం నుండి
తాటిముంజలు,చెరుకుగడలు,కొబ్బరిబొండాలు,సపోటాలు తెప్పించేవాళ్ళు.నానమ్మ,తాతగారు చెరొకప్రక్కన
పట్టుకుని రష్మిని ఉయ్యాలలో కూర్చోబెట్టి కబుర్లు చెపుతూ చిన్నగా ఊపుతూ ఆడించేవారు.కొంచెం పెరిగి  పెద్దయ్యేటప్పటికి కూతురికొడుక్కిచ్చి పెళ్ళిచేస్తే ఆస్థి బయటకు పోకుండా ఉంటుందనే ఆలోచన వచ్చింది.
కూతురికొడుకు చదువు అంతంతమాత్రం.రష్మిని బాగాచదివించి ఇంకా పైచదువులు చదువుకున్నఅబ్బాయికిచ్చి
పెళ్ళి చేద్దామనే ఆలోచన తల్లిదండ్రులది.వీళ్ళు పిల్లని ఇచ్చేట్లులేరని మనసులో కక్ష పెంచుకుని రష్మి వాళ్ళ ఆస్థిలో
సగభాగం దొంగచాటుగా కూతురి కొడుక్కి రాసేసి అనామకురాలితో పెళ్ళిచేసి ఇంట్లో పెట్టుకున్నారు.వీళ్ళకు తగిన అమ్మాయి కాకపోవటంవల్ల చాలా ఇబ్బందిపడ్డారు.రష్మి వాళ్ళతో పెద్దవాళ్ళు  అంతంతమాత్రంగా ఉన్నావీళ్ళు మాములుగానే వెళ్లి వస్తుండేవాళ్ళు.ఇంకాకోపంతగ్గక వాళ్ళమాట చెల్లలేదని మిగిలినసగం ఇంకోకొడుక్కి రాసేశారు.మనవడు దగ్గరే ఉంటామని ప్రగల్బాలు పలికారు.మనవడి భార్య పరమగయ్యాళి.మనవడు
కావాలనుకున్నందుకు సరిగా పట్టించుకోకుండా చనిపోయేముందు తాతను అర్థరాత్రప్పుడు ఊరిలోఉన్నరష్మి
వాళ్ళింట్లో పడుకోపెట్టి వెళ్ళిపోయాడు.
           చనిపోయేముందు ఒకవారంరోజులు రష్మిని తలుచుకునేవాడని చెప్పారు.రష్మి విదేశాలలో ఉంది.మధ్యలో
పరిణామాలనుబట్టి ఊరికే చెప్తున్నారులే అనుకున్నారు.ఒకరోజు తెల్లవారుజామున రష్మికి విచిత్రమయిన కల
వచ్చింది.ఒకచిన్నపిల్లవాడు వెనుకనుండి వీపుమీద ఎక్కి తనలో ప్రవేశిస్తున్నట్లు అనిపించి భయంవేసి బాబా,బాబా అంటూ మెలుకువవచ్చి లేచింది.తాత పొట్టిగా ఉండటంవల్ల పొట్టిచేతులుతో అన్పించింది.ఆయనకు అమెరికా పిచ్చి.
చనిపోయేముందు అమెరికా వెళ్ళివచ్చాను అంటూఉంటే మతిలేక మాట్లాడుతున్నాడు అనుకునేవాళ్లు.రష్మి బాబాకి నమస్కారం చేసుకుని ఇలాంటికల వచ్చిందేమిటి?అనుకుని వాళ్ళ అమ్మకు ఫోను చేసింది.ఈవిషయం వాళ్ళ అమ్మకు   చెబుదామనుకుంటే ఇంతలో వాళ్ళ అమ్మ మేము ఊరు బయల్దేరుతున్నాము తాతగారు చనిపోయారని చెప్పింది.అప్పుడు భారతదేశంలో సాయంసమయం.
   రష్మి కల విషయం చెప్పలేదు.ఆకార్యక్రమం అయిపోయిన తర్వాత కూతురు కొడుకంటే ఇష్టం కదా వాళ్లకడుపున
పుడతాడేమోలే అని రష్మి,వాళ్ళ అమ్మ నవ్వుకున్నారు.రష్మి కల విషయం మర్చిపోయింది.వీళ్ళకు ఆ ఆలోచనే లేదు.కొన్నిరోజులకు రష్మికి ఏదో తేడాగా అనిపించింది.తీరా రష్మికి వచ్చినకల నిజమయ్యింది.రష్మి గర్భం దాల్చింది.చనిపోయేసమయానికి  ఎక్కడో విదేశాలలో ఉన్నరష్మికి కలరావటమేమిటి? ఇక్కడ ఆసమయానికి తాత చనిపోవటమేమిటి?ఎక్కడో విదేశాలలో ఉన్న రష్మికి అనుకోకుండా గర్భం రావడమేమిటి?ఆయనకున్న విదేశీమోజు అనుకోవాలా?ఏమనుకోవాలి?అన్నీ సందేహాలే?రష్మి,వాళ్ళ అమ్మకూడా ఈరోజులలో కూడా ఇలాంటి వన్నీ నిజం అనుకోవటమేంటి?మూడనమ్మకం కాకపోతే అనుకునేవాళ్లు.కానీ ఇది నమ్మలేని నిజం.











గంతకు తగిన బొంత

            శరత్ వయసుకి తగినట్లుగా తెలివితేటలులేవు.పుట్టినప్పటినుండి అందరి పిల్లల్లాగా చలాకీగా లేకుండా
మందకొడిగా ఉండేవాడు.మాటలుకూడా ఏడుసంవత్సరాలవరకూ రాలేదు.తర్వాత స్కూల్లో చేర్చారు.ఎలాగో
తంటాలుపడి ఇంటర్ వరకు చదివాడు.అప్పటికే పాతిక సంవత్సరాలు దాటిపోయాయి.తండ్రి బల్లక్రింద చేతులుపెట్టి
నాలుగుచేతులతో బాగానే సంపాదించాడు.వీళ్ళ దగ్గర డబ్బుందికనుక బంధువులలో ఒక పిసినారి తనపెంచుకున్న కూతుర్ని ఇస్తానని వచ్చింది.ఆపిల్ల అతిగారాబంతో ఏదయినా అడగగానే కొనివ్వకపోతే చాకుతో చేతిమీద,కాలుమీద  కోసుకుంటానని బెదిరిస్తుంటుంది.అమ్మమ్మో అలాచేయకు,మా అమ్మవి కదూ అనిఅడిగినది కొనిస్తుంటారు.ఈ
విషయం బందువులలో,చుట్టుప్రక్కల అందరికీ తెలిసిపోయింది.పెళ్ళి చేయాలన్నాకష్టం కనుక పిల్లడు అంతంత
మాత్రంగా ఉంటే ఏమయిందిలే అతను ముందుముందు సంపాదించకపోయినా తండ్రి దిట్టంగా సంపాదిస్తున్నాడని
పెళ్ళి కుదుర్చుకున్నారు.గంతకు తగిన బొంత ఇద్దరూ ఎలాఉంటారో ఏమిటో?

Thursday 27 March 2014

అప్పటికప్పుడు తాజాగా

           అప్పటికప్పుడు అనుకోకుండా ఏదయినా పుట్టినరోజు పార్టీకిగానీ,చిన్నచిన్నవాటికి వెళ్ళాలంటే పార్లర్ కి

వెళ్ళేంత సమయము లేనప్పుడు ఇంట్లోనే ఇలా చేయవచ్చు.ఏదయినా తాజాపండ్లరసంలో పాలపొడి,తేనె కలిపి

ముఖానికి పాక్ వేసి ఒకపావుగంట తర్వాత చల్లటినీటితో  గుండ్రంగా మెడనుండి నుదురు వరకు పైకి రుద్దుతూ

పాక్ తొలగించాలి.అప్పటికప్పుడు ముఖం తాజాగా మెరుస్తూ ఉంటుంది.మురికిగా ఉన్నముఖం మీద ఎప్పుడు ఏ

 పాక్ వేయకూడదు.ముందుగా క్లెన్సర్ ని దూదిమీదవేసి ముఖము,మెడ శుబ్రంచేయాలి.లేదా పచ్చిపాలలోదూది

 ముంచి శుబ్రం చేసినా క్లెన్సర్ లాగా ఉపయోగపడుతుంది.పాక్ తొలగించిన తర్వాత  మనకు నచ్చినట్లు మేకప్

 వేసుకోవచ్చు.

Wednesday 26 March 2014

మచ్చబ్రపు వెధవ

         కాత్యాయని చెల్లెలు కూతురుకి పెళ్లిసంబంధాలు చూస్తున్నారు.పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టికెళ్ళినట్లు పిల్లను చూచుకోవటానికి వచ్చినప్పుడు పిల్లాడికి వరుసకు మేనత్తను తీసుకొచ్చారు.పిల్లను,తల్లిదండ్రులను,
కట్నకానుకలను,ఇంటివాతావరణాన్నిచూచిన తర్వాత ఇంతగొప్ప సంబంధం వీళ్ళకు రావటమేమిటని నాకు
వేలువిడిచిన మేనమామ మనవడు పిల్ల అమ్మమ్మ ఊరిలో ఉన్నాడు వాడిని కనుక్కుంటాను అనిచెప్పింది.
వాడు పెద్దరోగ్.ఏమీ తెలియకపోయినా అన్నీనాకే తెలుసని ఉన్నవిలేనివి అబద్దాలు నోటికొచ్చినట్లు చెపుతూ
ఉంటాడు.ఈమె అడగగానే వాళ్ళు రాజీవ్ గృహాలలో ఉంటారు అంత డబ్బువాళ్ళు ఇవ్వలేరుఅని కథలల్లి
నాపేరు బయటకు రానివ్వద్దని చెప్పాడు.అమ్మమ్మఊరివాళ్ళు తెలుసని చెప్పినవాళ్ళు నానమ్మ ఊరిలోవాళ్ళు
చెప్పారని చెప్పారు.చెప్పుడుమాటలు  వినేవాళ్ళు మనకెందుకులే అనివీళ్ళు ఊరుకున్నారు.అంతటితో ఊరుకోకుండా రోగ్ వీళ్ళింటికి ఫోనుచేసి మీరు రాజీవ్ గృహాలలోనేనా ఉండేది అనిఅడిగాడు.రాజీవ్ గృహల్లో
మాపనిమనిషి ఉంటుంది అనిచెప్పారు.వాడంతట వాడె తానే చెప్పానని నిరూపించుకున్నాడు.రెండునెలలు
తిరక్కుండానే మంచిసంబంధం కుదుర్చుకున్నారు.వాడు చెడు చేద్దామనుకుంటే వీళ్ళకే మంచి జరిగింది.
   
        పెళ్లి రంగరంగవైభవంగా చేశారు.పెళ్ళికి కావాలని వాడిని పిలిచారు.భార్య ,కూతురుతో వచ్చి కళ్ళుతిరిగి
క్రిందపడినంత పనిచేశాడు.పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ చాలా బాగాచేశారు.లోపలకు రాగానే స్వర్గలోకంలో
జరిగే పెళ్ళికి వచ్చామా అన్నంత అనుభూతి కలిగింది అనుకొన్నారు.వచ్చిన వాళ్ళందరకు రకరకాల పదార్ధాలతో
తిన్నవాళ్లకు  తిన్నంత ఎవరికి నచ్చినవి వాళ్ళు తినేటట్లు వందరకాలతో విందుభోజనాలు ఏర్పాటుచేశారు.
కొంతమందయితే పెళ్లి నుండి తిరిగివెళ్ళేటప్పుడు స్వర్గం నుండి తిరిగి భూమికి వచ్చినట్లుగా ఉంది అన్నారు.
పెళ్లి కావాల్సిన కూతురుంది వేరేవాళ్ళగురించి అవాకులు చెవాకులు మాట్లాడటమేమిటి?తెలిసి తెలియకుండా
ఏది పడితే అది వాగటం ఏమిటి?మచ్చబ్రపు వెధవ లాగా అని అందరూ వాడిని తిట్టారు.ఇలాంటి పిచ్చిపనులు చేసేవాళ్ళను మచ్చబ్రపువెధవలు అంటారు.

Tuesday 25 March 2014

నరరూప రాక్షసి

          ఈ నరరూపరాక్షసి ఒక అమ్మకు కూతురు,ఒక కూతురుకు తల్లి.అమ్మానాన్న కష్టపడి ఉన్నకొద్దిపొలంలో
వచ్చిన ఆదాయంతో పొదుపుచేసి బ్యాంకులో పనిచేసే గుమస్తాకిచ్చి పెళ్ళిచేశారు.అతను డబ్బుమనిషి.ఒక కూతురు
     పుట్టిన తర్వాత భర్తతో గొడవపడి కూతుర్ని తీసుకుని పుట్టింటికి వచ్చింది.కొద్దిరోజుల తర్వాత భార్యాభర్తలకు
 నచ్చచెప్పికాపురానికి పంపించారు.కూతుర్ని తల్లిదండ్రులదగ్గర వదిలేసి వెళ్ళింది.ఇంకొక ఆడపిల్ల పుట్టింది.
అప్పటినుండి భార్యాభర్తలు ఉన్నకొద్దిపాటిపొలం అమ్మేసి ఆడబ్బు వాళ్ళకుఇచ్చి వాళ్ళింట్లో తల్లిదండ్రిని చాకిరి
చెయ్యమనటం మొదలుపెట్టారు.అమ్మా మీకుపెళ్ళికి ఇవ్వదల్చుకున్నది ఇచ్చాము.ఉన్నదానితో మేము
బ్రతకాలికదా పిల్లభాద్యత కూడాఉన్నది అన్నారు.అప్పటినుండి రావటం మానేశారు.అల్లుడికి పక్షవాతం వచ్చిందని పిల్లను తీసుకుని చూడటానికివెళ్తే వీళ్ళకు భోజనంపెట్టకుండా వాళ్లుతినేసి పడుకున్నదికాక మీఅమ్మదగ్గర ఉన్న
బంగారం లాక్కోమనటం విని బ్రతుకుజీవుడా అని ఇంటిబాటపట్టారు.రాక్షసి కూతురు అంతటితో ఊరుకోకుండా
పెద్దవాళ్ళ దగ్గర పొలంతీసుకోవటానికి కూతురిపెళ్లి పన్నాగంపన్నింది.ఆడపడుచుకొడుక్కిఇవ్వమని ఖర్చుమీరు
పెట్టక్కరలేదు అనిచేప్పేసరికి పెద్దవాళ్ళు బుట్టలో పడిపోయారు.ఎవరితో చెప్పకుండా పెళ్లి కుదుర్చుకున్నారు.
ఈ పెళ్ళికి కూతురుఅల్లుడు రారుఅని చెప్తే నిజమేనని నమ్మారు.తీరా పెళ్లి పెత్తనం వాళ్ళదే.పెళ్ళయిన తర్వాతనుండి
కన్నకూతురు అనిలేకుండా పిల్లనుకొట్టి ఇబ్బందిపెడితే పెద్దవాళ్ళు అప్పుడయినా ఆస్థి ఇస్తారు అనిచేప్పేసరికి వాడు పెద్దవాళ్ళను,భార్యను కొట్టటం మొదలుపెట్టాడు.రాక్షసికూతురు నాకు పదిలక్షలు ఇవ్వాల్సిందే అని నలుగుర్ని వేసుకొచ్చి పెద్దమనుషుల ఇళ్ళకి తిరిగింది.వాళ్ళు హామీ ఇవ్వకపోయేసరికి నాలుగురోజుల తర్వాత సినీఫక్కీలో   అల్లుడ్ని,మరికొంతమందిని వేసుకొచ్చి తల్లిదండ్రులను కొట్టించి పిల్లనుకూడాకొట్టి రాళ్ళల్లోంచి ఈడ్చుకెళ్ళి ఆటోలోవేసి తీసుకెళ్ళింది.పిల్ల రక్షించండి,రక్షించండి అనికేకలుపెడుతుంటే దారిలో వచ్చేవాళ్ళు ఆటో ఆపారు.ఈలోపు తాత,అమ్మమ్మ  పెద్దమనుషులదగ్గరకువెళ్తే వాళ్ళు ఫోన్లు చేసి చెప్తే ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుని ఊర్లో నుండి ఒకవందమంది అప్పటికప్పుడు నిలబడినవాళ్లు నిలబడినట్లుగా చేస్తున్న పనులు ఆపేసి అందరూ
కర్రలు,చీపుళ్ళు తీసుకుని ఆడవాళ్లు,మగవాళ్ళు పరుగెత్తుకెళ్ళారు.అందరుచుట్టుముట్టేసరికి ఆపిల్లను తీసుకు వెళ్ళండి పదిలక్షలు ఇమ్మంటున్నదట.నువ్వుఅసలు కన్నతల్లివేనా?లేక డబ్బు పిశాచానివా?అని అందరూ అందర్నీకర్రలతో,చీపుళ్ళతో  బాదేద్దామనుకునేసరికి కొందరు ఆపి పోలీసులకు ఫోనుచేసి అందర్నీ  అరెస్టు చేయించారు.కూతురే నాతల్లికాదు అమ్మమ్మ,తాతే నన్నుపెంచారు. వీడు పెళ్ళిఅయిన దగ్గరనుండి డబ్బు,డబ్బు
అంటూ  నన్ను హింసిస్తున్నాడునేను పడలేనుఅనిచేప్పేసింది.తాత,అమ్మమ్మకూడా ఇప్పుడే ఇలావుంటే
పిల్లనుతీసుకెళ్ళి చంపేస్తారని భయపడిపోయారు. కూతురు సరయినది కాకపోవడంవలన,నరరూపరాక్షసిలా ప్రవర్తించటంవలన తల్లి,తండ్రి,కూతురికి కూడా ఇబ్బందులు తప్పలేదు. 

గుంజిగత్తెలు

             రేణుక అత్తమామలకు,ఆడపడుచులకు వీళ్ళింటికి వచ్చినప్పుడు ఎన్నో మర్యాదలు చేస్తుంటుంది.కానీ
వాళ్ళు వచ్చినప్పుడల్లా ఏదోఒకటి సతాయించుతూ ఇబ్బంది పెట్టేవాళ్ళు.వంటచేస్తుంటే ఇంత ఎందుకు వండటం
తగ్గించు ఇదే సరిపోతుంది అనేవాళ్ళు.తినేటప్పుడు అదిబాగుంది,ఇదిబాగుంది అంటూ వండినది తినేసేవాళ్ళు.
చివరకు రేణుకకు తినటానికి ఉండేది కాదు.భోజనం చేసేటైముకి తినటానికి లేకుండాచేస్తే వండుకుని తినేఓపిక
ఉండదు.వండేటప్పుడు వండనివ్వరు.ఒకరోజయితే ఏపండో తినొచ్చు.వారాలతరబడి ఉండాలంటే కష్టం కదా.
పనివాళ్ళకు టిఫిను పెట్టటం ఎందుకు?అన్నం పెట్టటం ఏంటి?అంటూ ఏమీ పెట్టనిచ్చేవాళ్ళు కాదు.ఒకరోజు
రేణుక పెద్దమ్మ వీళ్ళు ఉన్నప్పుడు వచ్చింది.వంటచేసేటప్పుడు కాపలాఉండి మరీ అత్త,ఆడపడుచు తగ్గించి
వంటచేయించారు.రేణుక పెద్దమ్మ అది చూచి అందరికీ సరిపోదుకదా తక్కువ వండావేమిటి?అని అడిగింది.రోజు
వాళ్ళు ఉన్నన్ని రోజులు అలాగే చేస్తారు.నాలుగురోజులు ఉండి వెళ్ళేవాళ్ళతో గొడవ ఎందుకని ఊరుకుంటాను
అని చెప్పింది.గుంజిగత్తెలు ఈరోజుల్లో కూడా ఇలా ప్రవర్తించటం ఏమిటి?వాళ్ళను నాలుగు మాటలతో కడిగేస్తాను
అంది.పెద్దమ్మానేను మాట్లాడలేకకాదు ఎప్పుడూ మాఇష్టం వచ్చినట్లే చేస్తాంకదా ఈనాలుగురోజులు నామీద  పెత్తనంచేస్తున్నామని సంతోషపడుతున్నారులే వదిలెయ్యి అంతమాత్రాన మనం నష్టపోయేదిఏమీ లేదుకదా
అని రేణుక అంది.

    

Saturday 22 March 2014

కలికాలం

           రోడ్డుమీద ప్రయాణిస్తుండగా కొంతదూరం నుండి వాహనాలన్నీ ఆగిపోయినాయి.విషయం ఏమిటో

కనుక్కోవటానికి వెళ్ళిన మనిషి అక్కడే చోద్యం చూస్తూ నిలబడి అరగంటకు వచ్చాడు.వచ్చీరాగానే అక్కడ

ఇద్దరు అన్నదమ్ములు కత్తులుపెట్టి,కొబ్బరిబొండాలుతో కొట్టుకుంటున్నారు అనిచెప్పాడు.కొబ్బరిబొండాలు

విసిరేసుకుని షాపు అద్దాలు కూడా పగలగొట్టేశారు అందుకని ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయినాయి

అన్నాడు.కొంతమంది ధైర్యంచేసి ఎలాగో వాళ్ళను ఆపి ఒకచోట కూర్చోబెట్టారు.ఇద్దరికీ గాయాలయ్యాయి.

ఎవరో పోలీసులకు సమాచారం అందించగా వచ్చి ఇద్దరినీ అరెస్టుచేసి పోలీసుస్టేషనుకు తీసుకెళ్ళారు.

ఏదయినా సమస్య ఉంటే పరిష్కరించుకోవాలి అంతేకానీ దీనివల్ల లాభం ఏముంది?ఇద్దరికీ నష్టం తప్ప.

కలికాలం కాకపోతే అన్నదమ్ములు రోడ్డుమీదికొచ్చి కత్తులతో కొట్టుకోవడమేమిటి?అని అందరూ విచిత్రంగా

చెప్పుకొంటున్నారు. 

వారం-వర్జ్యం లేనిరోజు

           నలికిలపాము అంటే అరచేయి అంతపొడవుఉంటుంది.పైన లేత పొగాకురంగులో ఉంటుంది.చూడటానికి

సన్నగా బల్లిలాగా ఉంటుంది.మెలికలు తిరుగుతూ పాకుతుంది.కొంతమంది మెలికలపాము అనికూడా అంటారు.

తోక,అడుగుభాగము ఆరెంజిరంగులో ఉంటుంది.చూడటానికి బాగానే ఉంటుంది.ఇది ఎవరినీ ఏమీ చేయదు.ఇది

వారం,వర్జ్యం లేనిరోజు కరుస్తుంది అని పెద్దవాళ్ళు అంటూ ఉండేవారు.ఆరెండు లేకుండా ఉండవు కనుక అది

ఎప్పుడూ ఎవరినీ కరవదు.ఇవి ఊళ్ళల్లో అరుదుగా కనిపిస్తుంటాయి.

Friday 21 March 2014

ముడతలు పోవాలంటే

     ముఖం మీది ముడుతలు పోవాలంటే బాగా నల్లగా ఉన్న పసుపుపచ్చని అరటిపండు తీసుకోవాలి.మెత్తగా

చేసిన అరటిపండు గుజ్జులో ఒక స్పూను తేనె,ఒకటిన్నర్ర స్పూను బార్లీపొడి వేసి పేస్టులాగా తయారుచేయాలి.దాన్ని

మాస్కులాగా మెడనుండి నుదురువరకు పైవైపుకు రాయాలి.అరగంట తర్వాత చల్లటి నీటితో గుండ్రంగా రుద్దుతూ

కడిగేయాలి.ఇలా అప్పుడప్పుడూ చేస్తూ ఉంటే ముఖం మీది  ముడుతలు తొలగిపోతాయి.

గుర్రపుచెవి

            గుర్రపుచెవి అంటే వానపాము అంత పొడవు ఉండి పలకరంగులో నున్నగా పట్టుకోవటానికి వీల్లేకుండా

జారిపోతుంటుంది.ఇది క్రిందపడుకుని నిద్రపోయేవాళ్ళ చెవిలోకి వెళ్లి ఇబ్బంది పెడుతుంటుంది.దాన్ని బయటకు

 తీయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంటుంది.ఈలోపు వాళ్ళు పడే నరకయాతన వర్ణించలేనిది.ఇది ఎవర్నీ ఏమీ

చేయదు.చెవుల్లోకి మాత్రమే వెళ్లి ఎంతో ఇబ్బంది పెడుతుంటుంది.క్రింద పడుకొని నిద్రపోయేవాళ్ళు గుర్రపుచెవి

పేరు చెపితే చాలు హడలిపోతుంటారు.

Wednesday 19 March 2014

జమునాపాప

               మోక్షి కళాశాలలో చదువుకొనేటప్పుడు ఒక ప్రైవేటు నుండి ఇంకొకదానికి వెళ్ళటానికి ఐదునిమిషాల టైము మాత్రమే ఉండేది.దారిలో అప్పట్లో గుడిసెలు ఉండేవి.ఆగుడిసెల్లోనుండి ఒక చిన్నఅమ్మాయి రోజూ వీళ్ళ వెనుక పరుగెత్తుకుంటూ వచ్చి జమునాపాప అంటూ పిలిచేది.వీళ్ళు మొదట్లో పట్టించుకోలేదు.ఒకరోజు ఎందుకు
జమునాపాప అంటూ మావెనుక పరుగెత్తుకొస్తున్నావు? అని అడిగారు.మోక్షి దగ్గరకు వచ్చి ఈపాప అచ్చు
సినిమాలో జమునలాగా ఉంటుంది.ఆమె అంటే నాకిష్టం అందుకే అలా పిలుస్తున్నాను అని చెప్పింది.అలా ఏమీ
ఉండదు జమునాపాప అని పిలవకు అని చెప్పారు.అయినావినకుండా అలాగే ఉంది నేనుఅలాగే పిలుస్తాను అని
రోజు వెంటపడేది.ఆఅమ్మాయిని తప్పించుకోవటం కోసం వీళ్ళు వేగంగా నడిచివెళ్ళేవాళ్ళు.లేకపోతే చేతులు పట్టుకోవటానికి ప్రయత్నించేది.   

Tuesday 18 March 2014

కాళ్ళజెర్రి

        కాళ్ళజెర్రి అంటే అరచేతి పొడవుండికాళ్ళు ఎక్కువ ఉంటాయి.ఇది అంత త్వరగా కుట్టదు.కుట్టిందంటే బాగా

వాపు వస్తుంది.కొన్ని సంవత్సరాలక్రితం వైద్యులు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు కనుక భార్యాభర్తలు ఇద్దరి

పేర్లు కలిసినట్లుగా అంటే వెంకటయ్య,వెంకటమ్మ లాంటి పేర్లు ఉన్నవాళ్ళతో వాపువచ్చినచోట మట్టి రుద్దించుకొనే

వాళ్ళు.అలాచేస్తే వాపుతగ్గిపోతుందని భావించేవాళ్ళు.ఒకసారి లక్ష్మి కాలుమీద కుట్టింది.ఇంజెక్షనుచేయించుకున్నా

నాలుగురోజులకు కానీ వాపుతగ్గలేదు.

మానవసేవే మాధవసేవ

        అపరంజి మానవసేవే మాధవసేవ అని ఎవరు ఎక్కడ ఇబ్బందుల్లో ఉంటే అక్కడకు వెళ్లి వాళ్ళకు సహాయం  చేస్తుంటుంది.చిన్నప్పటినుండి చదువుకున్న స్కూలులో కూడాఅదే నేర్పించడం వలన అపరంజి ఇంట్లో వాళ్ళది
కూడా అదేస్వభావం కనుక అపరంజికి బాగా వంటబట్టింది.ఆకలితో ఉన్నవాళ్ళకు పట్టెడుఅన్నంపెట్టటం,ఆపదలో
ఉన్నవాళ్ళను ఆదుకోవటం,అత్యవసర వైద్యసేవలు అవసరమైతే ఆసుపత్రికి తీసుకెళ్లటం,ఎవరయినా తగాదాలు
పెట్టుకుని  వీళ్ళింటికివస్తే రాజీచేయటం పూర్వం తాతలనుండి పరిపాటి.ఆఅలవాటే ఇప్పటికీ కొనసాగుతుంది.
సహయంపొందినవారి కళ్ళల్లోని సంతృప్తికరమైన కృతజ్ఞతాభావం ఎన్నటికి మర్చిపోలేనిది.ఈరోజుల్లో సహాయం
పొంది అవతలికి వెళ్లి పిచ్చివాళ్ళు కనుక ఎదుటివారికి సహాయపడుతున్నారు అనిఅవహేళనగా మాట్లాడేవాళ్ళే  ఎక్కువమంది వుంటున్నారు.ఎవరిభావాలు ఎలావున్నా అపరంజివాళ్ళకనవసరం.సహాయంపొంది మర్చిపోవటం
వాళ్ళ తప్పు.అవసరమయినపుడు ఎదుటివాళ్ళకు సహాయపడటం కనీస మానవధర్మం.అందరూ స్వార్థంతోఉంటే
ఈ ప్రపంచం ఇలాకూడా ఉండదు.ఎవరయినా ఎదుటివాళ్ళకు అవసరమయినపుడు సహాయపడితే దైవసేవ చేసినంత ఫలితం.


  

Friday 14 March 2014

విశాలహృదయం

          సమత ఒదిన సుజాత చాలా మంచిది.సమతకు రెండోబిడ్డ పుట్టినప్పుడు పెద్దజబ్బు చేసింది.సుజాతబిడ్డ
సమతబిడ్డకన్ననాలుగు నెలలు పెద్దది.సుజాత తనబిడ్డతోపాటు సమతబిడ్డ ఆలనాపాలనా చూచుకొంటూ తనే
ఇద్దరికీ తనపాలే ఇచ్చి పెంచింది.తనూపసిపిల్ల తల్లయినా సమతను ఒక్కపని కూడా చేయనివ్వకుండా ఇద్దరు
పిల్లలను చూసేది.పండుగలకు సమతకుటుంబం,అక్కసుజితకుటుంబం,అమ్మ,నాన్న,అందరూ వచ్చినా విసుగు
విరామంలేకుండా అందరినీ కూర్చోబెట్టి తనే అన్నిపనులు చక్కబెట్టేది.సుజాత అమ్మావాళ్ళు,చుట్టుప్రక్కలవాళ్ళు
వడియాలు,అప్పడాలు,పిండివంటలు ఏమయినా పంపినా తనువాడుకోకుండా ఆడపడుచులకోసం దాచిపెట్టేది.
తనపిల్లలతోపాటు ఆడపడుచులపిల్లను కూడా సమానంగా చూస్తుంది.సమత,సుజాత మామంచి ఒదిన అని మురిసిపోతుంటారు.సమత అమ్మానాన్న కూడా మంచికోడలు వచ్చిందిఅని సంతోషపడతారు.పెళ్లి అయినతర్వాత
అత్తమామలు,ఆడపడుచులు ఇంటికి రాకూడదు అనుకునే రోజులు ఇవి.ఈరోజుల్లో ఇంతప్రేమగా విశాలహృదయంతో ఎవరు ఉంటున్నారు?తనుకన్నబిడ్దకే పాలిస్తే అందం తరిగిపోతుందనుకునే రోజులు.ఆడపడుచు బిడ్డకుకూడా పాలు  ఇవ్వటం చాలా గొప్పతనం.

Wednesday 12 March 2014

ఆరోగ్యమే మహాభాగ్యం

          ఈ హడావిడి తీరికలేని జీవనవిధానంలో ఆడవాళ్లయినా,మగవాళ్లయినా తమఆరోగ్యంకోసం ఒకగంట 
కేటాయించి తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.నడక,సైకిలుతొక్కటం,యోగా,జిమ్ కివెళ్ళటం,సూర్యనమస్కారాలు చేయటం,ప్రాణాయామంచేసుకోవటం,ఎరోబిక్స్,డాన్స్,ఎవరికి నచ్చినవ్యాయామం వారుఎంచుకుని వాళ్లవీలునిబట్టి
చేసుకుంటే బావుంటుంది.మనకు తీరిక లేదులే అనుకోకుండా అదికూడా తప్పక చేయవలసినపని అనుకుని 
చేయాలి.నూనె తక్కువవేసిన ఆహారం,పండ్లు,కూరగాయలముక్కలు,మొలకెత్తినవిత్తనాలు తినటం మంచిది. 
నీళ్ళు ఎక్కువగా త్రాగాలి.అన్నం తక్కువతిని ఓట్లు,రాగులు,సజ్జలు,జొన్నలు,కొర్రలుతో చేసినపదార్దాలు కూడా 
తినటం మంచిది.వారానికి 2,3 సార్లయినా ముడిబియ్యంతో వండినఅన్నం తినటం మంచిది.కేరట్ రసం త్రాగితే 
శరీరానికి మంచిమెరుపు వస్తుంది.అనారోగ్యం వచ్చినతర్వాత జాగ్రత్తపడేకన్నాముందే జాగ్రత్తపడటం మేలు.
ఆహారం తీసుకోవటంలో జాగ్రత్తలు పాటిస్తూ వ్యాయామం చేస్తూవుంటే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.బరువు పెరగకుండా ఎప్పటికప్పుడు చూచుకుంటూ బియంఐ 25 లోపు ఉండేలాచూడాలి.పిల్లలకుకూడా చిన్నప్పటినుండే   సరియిన ఆహారపు అలవాట్లు నేర్పించాలి.మెంతులు కూడామన ఆహారంలోభాగం చేసుకుంటే మధుమేహం 
రాకుండా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం.
     

Tuesday 11 March 2014

గాలిలో తేలినట్లుందే

            సునయన డిగ్రీ చదువుకున్నప్పటి స్నేహితులు పెళ్ళిళ్ళు అయినతర్వాత వేరువేరుచోట్ల స్థిరపడటంవలన
ఒకరికొకరికి సత్సంబంధాలు లేవు.ఒకస్నేహితురాలికి పార్టీలో ఇంకొక స్నేహితురాలు కనిపించి కళాశాల కబుర్లు ముచ్చటించుకున్నారు.ఒకరికొకరు ఫోనునెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు.ఒకామె దానిగురించే మర్చిపోయింది.
ఇంకొకామె కొన్నిరోజుల తర్వాత ఫోనుచేసింది.వాళ్ళింట్లో ఎవరో మాట్లాడి సరిగా సమాధానం చెప్పలేదు.అయినా పట్టువదలని విక్రమార్కురాలిలాగా ఇంకో స్నేహితురాలి నెంబరు సంపాదించింది.ఆ స్నేహితురాలి ద్వారా
సునయనకు ఫోనుచేసింది.చాలా సంవత్సరాలతర్వాత స్నేహితురాలితో మాట్లాడటంవలన చాలా సంతోషంగా
ఉండి సునయనకు గాలిలో తేలిపోయినట్లనిపించింది.ఎంతో పట్టుదలతో స్నేహితురాళ్ళతో మాట్లాడాలని ప్రయత్నించిన విధానం సునయనను అబ్బురపరిచింది.

బలి

           ఒకకాలనీలో ప్రక్కప్రక్క అపార్టుమెంటుల్లో ఇద్దరు కాపాలాదారులుగా ఉంటున్నారు.ఒకళ్ళకు ఒక కొడుకు

ఉన్నాడు.పిల్లవాడు అందంగా ఉన్నాడు.వయసు పదినెలలు.ఇంకొక అతనికి పిల్లలు లేరు.ఒకవేళ అతనికి కొడుకు

ఉన్నాడు నాకులేడని మనసులో ఈర్ష్య ఉందేమో?ఒకరోజు అందరూ నిద్రపోతుండగా అర్దరాత్రప్పుడు పిల్లవాడ్ని

తీసుకెళ్ళి మెడ చాకుతో కోసేసి మా అపార్టుమెంటు మీపిల్లవాడ్నిబలి కోరింది.అందుకని పిల్లవాడి మెడకోసిబలి

ఇచ్చానన్నాడు .లబోదిబోమని వీళ్ళు చూసేసరికే పిల్లవాడి ప్రాణం గాలిలో కలిసిపోయింది.లేకలేక పుట్టినపిల్లాడ్ని

వీడు పొట్టన పెట్టుకున్నాడని భోరుభోరున ఏడుస్తుంటే అర్ధరాత్రప్పుడు చుట్టుప్రక్కలవాళ్ళు అందరూ వచ్చి వాడ్ని

గదిలో బంధించి పోలీసులకు ఫోనుచేసి అరెస్టుచేయించారు.వాడికి మానసికంగాతేడా ఉండితనకు పిల్లలు

 లేరుకనుక ప్రక్కవాళ్ళకు పిల్లాడు ఉన్నాడని ఈర్ష్యతో చంపేసి బలి కోరితే ఇచ్చానని చెప్పాడు. 

అపాత్రదానం

         సంజన పనివాళ్ళను తనఇంట్లో వాళ్ళలాగా చూస్తుంటుంది.ఏకొంచెంచేసినా ఇస్తుంటుంది.ఇంతకుముందు
పనివాళ్ళుకూడా బాగాచూస్తుంటుందని ప్రత్యేకంగా వీళ్ళకు పనిచేసేవాళ్ళు.సంజన స్నేహితురాళ్ళుకూడా సంజనకు పనివాళ్ళవల్ల ఎదురయ్యే ఇబ్బందులు తెలియవు అదృష్టవంతురాలు అనుకొనేవాళ్ళు.అలాంటిది ఈమధ్య సంజన కూడా పనివాళ్ళవల్ల ఇబ్బంది పడుతోంది.వచ్చిన చిక్కేమిటంటే ఇప్పుడుకూడా సంజన బాగానే చూస్తుంది.
ఇంతకుముందువాళ్ళకన్నాఅడిగిమరీ అన్నీ పట్టుకెల్తుంది.అమ్మా పన్నునొప్పిగాఉంది మెత్తగాతింటాను సాంబారు
ఉంటే ఇవ్వండమ్మా లేకపోతే కొంచెం పెట్టండమ్మా అని నిర్మొహమాటంగా అడుగుతుంది.పెట్టేవికాక అడిగిమరీ
తీసుకుని వెళ్ళటం తెలుసుకానీ పనికి రావటం తెలియదు.ఇచ్చేజీతంకాక ఇంత తింటున్నాము కదా అమ్మ ఇబ్బంది పడుతుందేమో అనేజ్ఞానమే లేదు.సంజన స్నేహితురాళ్ళు నువ్వు అందరికీ కన్పించిన వాళ్ళకల్లా అపాత్రదానం చేస్తుంటావు.తిన్నవిశ్వాసం లేకుండా నిన్ను ఇబ్బంది పెడుతుంటే నువ్వు బాగా చూడాల్సిన అవసరం ఏమిటి?
పెట్టటం మానేసెయ్యి.ఈరోజుల్లో చదువుకున్నవాళ్ళే ఇంగితజ్ఞానం లేకుండా తినేసి ఊరుకుంటున్నారు.ఇక
పనివాళ్ళదేముంది? ఏదయినా దానం ఇవ్వాలన్నాతీసుకోవాలన్నా అర్హత ఉండాలి అపాత్రదానం పనికిరాదు.ఇక
నుండయినా తెలుసుకో అన్నారు.నేను దానంచేస్తున్నాను అనే ఉద్దేశ్యంతో ఏదయినా ఇవ్వను మనకు చేసేవాళ్ళకు,
చెప్పేవాళ్ళకు ఇవ్వాలి అదిమన సంస్కారం అని నాఅభిప్రాయం.తినేసి మొండిచెయ్యి చూపించటం వాళ్ళసంస్కారం.  చదువుకున్నవాళ్లయినా,చదువుకోనివాళ్లయినా అది వాళ్ళ బుద్దిలోపం అనుకుంటాను అని సంజన చెప్పింది.

Saturday 8 March 2014

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

నా  బ్లాగ్ ను వీక్షించే మహిళా వీక్షకులందరికి  మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.మహిళలు తలుచుకుంటే 
దేన్నైనా సాధించగలరు.ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ తప్పకుండా ఉంటుంది.ఇంటికి దీపం ఇల్లాలే.
ఒక ఇంటిలో ఇల్లాలు విద్యావంతురాలయితే ఆ ఇంటిలో పిల్లలను విద్యావంతులుగా,సంస్కారవంతులుగా
తయారు చేస్తుంది.ప్రతి స్త్రీ ఎవరిమీద ఆధారపడకుండా తన కాళ్ళమీద తను నిలబడగలగాలి.తన పిల్లలను
కూడా అలాగే తీర్చిదిద్దాలి.ప్రతి స్త్రీ ఒక శక్తి స్వరూపిణి.



 

Wednesday 5 March 2014

కాలుకాలిన పిల్లి

              ప్రత్యూష్ పిన్నికొడుకు విదేశాలలో ఉంటాడు.ఇంజినీరు అయినా సూపర్ మార్కెట్లో కూడా పనిచేసి కొంత

డబ్బు సంపాదించి స్వదేశానికి వచ్చి  తెగసంపాదించినట్లు పోజులు కొడుతున్నాడు.పెద్దకారుకొని చుట్టాలందరి

ఇళ్ళకు కాలుకాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు.ఎందుకంటే షో చేస్తే బాగా సంపాదిస్తున్నాడని అనుకొని గొప్ప

సంబంధం వస్తుందేమోనని ఆశ.ప్రత్యూష్ పెళ్లి ఈమధ్యనే అయ్యింది.పోటీగా ప్రత్యూష్ కన్నా గొప్ప సంబంధము

వస్తే బాగుంటుందని రావాలని కోరిక.కోరిక ఉండటం సహజం కానీ అత్యాశ పనికి రాదుగా.

తింగర బుచ్చడు

        స్వాతి బంధువులలో ఒక తింగర బుచ్చడు ఉన్నాడు.అతను అందరికీ ఫోనుచేసిమరీ మీఫోను నుండి మాకు

ఫోనొచ్చింది.మీరు చేశారా?అని అడుగుతాడు.మేము చేయలేదండీ అంటేమరి మాకు మీనెంబరు నుండే వచ్చిందండీ

 అంటాడు.మేముచేయలేదు బాబో అంటే సరేనని అప్పుడు ఫోను పెట్టేస్తాడు.అసలు ఎవరూ వాళ్ళకి చెయ్యకుండానే

 ఫోను ఎలా వెళ్తుంది?పైత్యం కాకపోతే అని అందరూ తిట్టుకొని తింగర బుచ్చడు ఎప్పుడు పడితే అప్పుడు ఫోనుచేసి

విసిగిస్తాడు అనుకొంటారు.కొందరు పాపం కాస్త బుర్ర  తేడావచ్చిందేమో అని జాలిపడతారు.


మిస్స్డ్ కాల్స్

        పావనికి బంధువులు,స్నేహితులు కూడా దూరప్రాంతాలలో ఉంటారు.వాళ్ళ అవసరార్ధం మాట్లాడాలంటే కూడా పావనికి మిస్స్డ్ కాల్స్ చేస్తుంటారు.పోనీలే వదిలేద్దామనుకుంటే మళ్ళీమళ్ళీ వెంటవెంటనే ఆపకుండా చేస్తుంటారు.
అక్కడికీ పావనీనే ఎక్కువగా చేస్తుంటుంది.వాళ్ళ డబ్బులు ఖర్చు కాకూడదు అనుకుంటారేగానీ అది మంచిపద్దతా
కాదా అని ఆలోచించరు.మనడబ్బులాంటిదే ఎదుటివాళ్ళడబ్బు కూడా అనుకోరు.ఒకవేళ అది మంచి పద్దతికాదని అనుకొన్నావాళ్ళకి డబ్బే ముఖ్యం.ఇబ్బందుల్లో ఉండిచేసారేమో అనుకోవటానికి అదీలేదు.అందరూ కూడా
 సంపాదనాపరులు,ఆస్థిపరులు.కాకపోతే చాలామందికి మిస్స్డ్ కాల్స్ ఇవ్వటం అనే ఫాషనబుల్  చెడ్డఅలవాటయింది.

మనసౌకర్యం-ఎదుటివారిఇబ్బంది

         సౌమ్య వాళ్ళ రోడ్డులో క్రొత్తగా ఒకకుటుంబంవచ్చింది.వాళ్ళసౌకర్యార్దం లోపలినుండి కారు బయటకు తీసే
పనిలేకుండా రోడ్డుమీద పెట్టేస్తారు.వాళ్ళఇంటెదురతను కూడా బైకు రోడ్డుమీద పెడతాడు.ఎవరైనా ఆరోడ్డులో
వెళ్ళాలంటే కారు అడ్డుతీయమంటే బైకు తీయమంటాడు.బైకు తీయమంటే కారు తీయమని చెప్పమంటాడు.
వీళ్ళిద్దరివలన మిగతావాళ్ళకు ఇబ్బందికరంగా ఉంది.చేతనయితే ఎదుటివారికి సహాయం చేసేటట్లుగా ఉండాలి.
లేదంటే ఏమీఎరగనట్లుగా కూర్చోవాలి.అంతేగానీ ఎదుటివారికి ఇబ్బంది కలిగించకూడదు.మనసౌకర్యం ఎదుటివారికి ఇబ్బంది కాకూడదు.ఇదితేలిసేంత సంస్కారమే ఉంటే ఇద్దరూ అలా ప్రవర్తించరు.

   

Tuesday 4 March 2014

పేనుకు పెత్తనమిస్తే

        సాకేత్ అతనిస్నేహితులు కలిసి ఒకఆసుపత్రి కట్టించారు.వీళ్ళంతా వైద్యులు.విదేశాలలో మంచి వైద్యులుగా స్థిరపడ్డారు.మాతృదేశంలోమంచివైద్యం అందుబాటులోకి తేవటం కోసం అందరూకలిసి వైద్యపరీక్షలు నిర్వహించే నిమిత్తం విదేశాలనుండి పరికరాలను తెప్పించారు.స్వదేశంలోని వైద్యులను నియమించి వాళ్ళుకూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారివచ్చి ఉచితసేవలు చేసేవారు.మిగతావాళ్ళకు ఇష్టంలేకపోయినా తనబావను ఆసుపత్రిలో మేనేజరుగా పెట్టాడు.అతను వైద్యుడుకాదు కనుక ఆసుపత్రి బాధ్యతలుసరిగా నిర్వర్తించలేడని మిగిలినవాళ్ళు చెప్పారు.వాళ్ళ మాటలు పెడచెవినపెట్టి అతనికే పెత్తనం ఇచ్చాడు.అతను ఉండేటట్లయితే ఆసుపత్రి సరిగా నడవదని మేము వెళ్లి
పోతామనిచెప్పినా స్నేహితులను వదులుకోవటానికి సిద్దపడ్డాడు.ఇతనివలన వాళ్లస్నేహం దెబ్బతింది.పేనుకు
పెత్తనం ఇస్తే చేను అంతా గొరిగేసినట్లుగాచేశాడు బావ.సాకేత్ అనుమానించకుండా నమ్మించి మోసం చేశాడు.
సాకేత్ తెలుసునేసరికి చాలానష్టపోయాడు.స్నేహితులను,బంధువులను,డబ్బును పోగొట్టుకున్నాడు.ఆసుపత్రి
అంతంతమాత్రంగా నడుస్తుంది.       

ఊకదంపుడు

       ఊర్మిళ రెండిళ్ళల్లో ఇంటిపనులు చేసుకొనేది.ఒకసారి ఊర్మిళ పనిచేసే ఇంటిప్రక్కకి బ్యాంకులో పనిచేసేఅతను
వచ్చాడు.మా ఆవిడ,పిల్లలను తర్వాత తీసుకొస్తాను పనిచెయ్యమని అడిగితే చేస్తానంది.ఒకరోజు చేసిన తర్వాత
చీపుళ్ళుతెచ్చుకోమని ఐదువందలు ఇచ్చాడు.పండగవస్తందిగా పిల్లలకు బట్టలుకొనుక్కోమని మరోఐదువందలు
ఇచ్చాడట.మాపిల్లలకు మీరు ఇవ్వటం ఏమిటి?అన్నదట.నువ్వుకూడా చీరకోనుక్కో?అని ఇంకో ఐదువందలు
ఇస్తే అప్పుడు మెదలకుండా ఊరుకుని ప్రక్కింటిఆమె దగ్గరకువెళ్లి చెప్పింది.ఊర్మిళ అమ్మను కూడా తీసుకుని
వాడింటికి వెళ్లి పనివాళ్ళంటే ఎలా కనపడతన్నారు? ఏరా డబ్బులిస్తావా?వేళాకోళంగా ఉందా?అని చీపురుకట్టలు
తిరగేసి ఊకదంపుడు కార్యక్రమం మొదలుపెట్టారు.అమ్మా!తప్పయింది ఇక ఎప్పుడూ ఎవరితో అలాప్రవర్తించను
అనేవరకూ పిచ్చికొట్టుడు కొట్టారు.తర్వాత వాడు ఎవరికీ మొహం చూపించలేక అక్కడినుండి వెళ్ళిపోయాడు.

ఐకోకం -బైకోకం

           పూర్వం రవాణాసౌకర్యాలు సరిగాలేనందున పెళ్ళిళ్ళు ప్రక్కప్రక్కఊళ్ళల్లో పిల్లలను వెతుక్కుని మరీ

 చేసేవాళ్ళు.పెళ్లి అయినతర్వాత పెళ్ళికొడుకుని,పెళ్ళికూతుర్ని పల్లకీలో అత్తగారింటికి తీసుకొచ్చేవారు.ఆ

పల్లకీని నలుగురు బోయీలు మోసేవాళ్ళు.వాళ్ళు బరువుతెలియకుండా ఐకోకం-బైకోకం అంటూమోసుకుని

వచ్చేవాళ్ళు.మధ్యమధ్యలో క్రిందికి దించి తినుబండారాలు తింటూ వచ్చేవాళ్ళు.రవళి జేజమ్మకు,తాతయ్యకు

చిన్నపిల్లలకే పెళ్లిచేశారు.పెళ్లిఅంటే ఏంటోకూడా తెలియనివయస్సు.వాళ్ళుమాట్లాడుకోకుండా,అల్లరిచెయ్యకుండా

ఏమీతినకుండా నిశ్శబ్దంగా కూర్చున్నారట.ఈపిల్లలను చూచి బోయీలు దొందూ-దొందే అని నవ్వుకున్నారట. 

ఇసుక తక్కెడ-పేడ తక్కెడ

          సామ్రాజ్యం,సోమయ్య భార్యాభర్తలు.సహజంగా భార్యాభర్తలు ఇద్దరిలో ఇద్దరూ తెలివైనవాళ్ళో,ఎవరోఒకరు
బాగా తెలివిగలవాళ్ళో ఉంటారు.అలాంటిది సామ్రాజ్యం,సోమయ్య ఇద్దరూ అమాయకంగా ఎవరుఏది చెయ్యమంటే
అదిచేస్తూ ఉంటారు.ఇద్దరూ కష్టించి పనిచేసేతత్వం.దీన్ని ఆసరాచేసుకుని అన్నదమ్ములు,అక్కచెల్లెళ్ళు,చుట్టు
ప్రక్కలవాళ్ళు ఏదోఒకటి పనులు చేయించుకునేవాళ్ళు.కలిసుంటే కలదు సుఖం అని తల్లిదండ్రులు,ఐదుగురు
అన్నదమ్ములు భార్యలు,పిల్లలతో కలిసి ఉమ్మడికుటుంబంగా ఉండేవారు.ఒకసారి నలుగురుఅక్కచెల్లెళ్ళు,భర్తలు
పిల్లలతో వీళ్ళింటికి వచ్చారు.రోజువారీ పనులు ఎక్కువ సామ్రాజ్యం,సోమయ్య చేసేవారు.ఆరోజు మరీఎక్కువగా చేయవలసి వచ్చింది.సామ్రాజ్యం పూర్తిగా వంటగదిలో,సోమయ్య బయటిపనులతో సతమతమయ్యారు.మిగిలిన
వాళ్ళు పైపైపనులు తప్ప పూర్తిభాద్యత తీసుకునే వాళ్లుకాదు.ప్రక్కింటివాళ్ళు వీళ్ళనిచూచి ఇసుకతక్కెడ
పేడతక్కెడ లాగా ఇద్దరూసరిపోయారు అని జాలిపడేవాళ్ళు.

  

Monday 3 March 2014

పాముకు పాలు

          వనజాక్షి ఒకపల్లెటూరిలో ఉంటుంది.అత్తింటివారి ఆనవాయితీ ప్రకారము రోజూ ఒకగిన్నెలో పాలుపోసి దేవుడి గదిలో పెట్టేవాళ్ళు.కోడలిగా వాళ్ళింట్లో అడుగుపెట్టినప్పుడే గిన్నెలో పాలుపోసి రాత్రిపూట దేవుడి గదిలో పెట్టాలని
చెప్పారు.ఎందుకు?ఏమిటి?అని అడగకూడదు కనుక ప్రశ్నించలేదు.మొదట్లో ఎందుకు పెడుతున్నారో అర్ధంకాలేదు.
అయినా ఒక్కొక్కసారి వనజాక్షి కూడా పెట్టేది.తెల్లవారేసరికి గిన్నెఖాళీగాఉండేది.అసలు ఏమిజరుగుతుందో చూద్దామని ఒకరాత్రంతా మెళుకువగా ఉంది.దేవుడిగది దగ్గరే కాపలా కాసింది.మధ్యరాత్రిలో ఒకనల్లటి తాచుపాము గిన్నెలోపాలు తాగేసి వెళ్ళిపోయింది.తర్వాతిరోజు ఉదయమే భయపడుతూనే వాళ్ళఅత్తగారిని గిన్నెలో పాలగురించి
ఏమవుతున్నాయో కొంచెము చెప్పమని అడిగింది.మనఇలవేల్పు నాగేంద్రస్వామివచ్చి పాలుతాగి వెళ్తారని మా
నమ్మకం అనిచెప్పారు.అప్పటినుండి వనజాక్షి కూడా భయంతోనో,భక్తితోనో రోజు రాత్రిపూట దేవుడి గదిలో గిన్నెలో  పాలుపెట్టటం అలవాటు చేసుకుంది.గతరెండున్నర ఏళ్లనుండి పెడుతూనే ఉంది.ఇకముందు కూడా పెడుతూనే ఉంటుంది.

పరుగో పరుగు

        జలజాక్షికి ఊరిలో తాటిఆకులతో వేసిన ఇల్లుఉండేది.తాటాకులు కనిపించకుండా బరకం కట్టేవాళ్ళు.
తాచుపాము,జెర్రిగొడ్డు కలిపి ఒకేపాముగా అరుదుగా ఉంటాయని అటువంటిపాము జలజాక్షి ఇంట్లో ఉండేది.
అది వీళ్ళింట్లోవాళ్ళకు మాత్రమే కనిపించేది.ఎవరైనా చూద్దామని ప్రయత్నించినా కనిపించేదికాదు.బయటకు పంపేద్దామని ప్రయత్నించినా వెళ్ళలేదు.ఎవరినీ ఏమీచేయటంలేదుకదాదాన్ని ఏమీచెయ్యొద్దు వదిలేయండి
అంటే వదిలేశారు.ఆహారంకోసం పొలాల్లోకివెళ్తూ గోడమీద కనపడేది.అప్పుడప్పుడు పైనుండి క్రిందపడేది.ఒకసారి
చుట్టుప్రక్కలవాళ్ళు,వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా వీళ్ళమధ్యలో పడింది.అందరూ కంగారుపడి
పరుగో పరుగు.అంతపెద్దపాము పెద్దశబ్దంతో క్రిందపడేసరికి చాలాభయపడి ఇకమీఇంటికి మేమురాము మీరేరండి
అనేశారు.భయంతో ఎవరూ జలజాక్షి ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు.  

Saturday 1 March 2014

బాగున్నారా?

     రత్నావతి బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్ళింది.ఎక్కడెక్కడో దూరపుబంధువులు కూడా ఆపెళ్ళికి వచ్చారు.
ఒకరికొకరు పలకరింపులయ్యాక తాత వరుసయ్యే పెద్దాయన కనిపించారు.రత్నావతి ఆయన దగ్గరకు వెళ్లి
తాతగారూ బాగున్నారా?అని పలకరించింది.బాగుండబట్టే కదా ఇక్కడకు వచ్చాను అన్నాడు ఆ పెద్దాయన.
 ఏమి మాట్లాడాలో తెలియక రత్నావతి సరేనండి వేరేపని ఉంది వస్తాను అని ఇవతలకు వచ్చేసింది.రత్నావతి స్నేహితురాలుతో ఈవిషయం చెప్పగానే పోయిపోయి అతన్నిపలకరించావా?అతనుఅందరితోఅలాగే వ్యంగ్యంగా
మాట్లాడతాడు అందుకే ఎవరూ ఆయన్ని పలకరించరు ఆయనంతట ఆయన మాట్లాడితేనే మాట్లాడతారు అని
చెప్పింది.ఇలాంటివాళ్ళతో మాట్లాడి మన బుర్ర పాడుచేసుకోవటం తప్ప ప్రయోజనం ఉండదు పద పెళ్లి మొదలైంది అని తీసుకెళ్ళింది.ఇప్పుడు ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది తారసపడుతున్నారు.అందుకని
ఎదుటివారు  ఎలాంటివారో చూచి మాట్లాడాలన్నమాట. 

సానుకూల దృక్పధం

           సానుకూల దృక్పధంతో ఉంటే ఎంతటి క్లిష్ట పరిస్థితినైనాఎదుర్కోవచ్చు.రోషన్ స్నేహితుడు రణబీర్ చాలా
ధైర్యవంతుడు.ప్రతివిషయం సానుకూలంగా ఆలోచించి నేను ఎలాగైనా దీన్నిసాధించగలను అనేఅభిప్రాయంతో,
పట్టుదలతో సాధించేవాడు.అలాగేజీవితంలో ఉన్నతస్థితికి చేరుకున్నాడు. అతనికి ఒకసారి పెద్దజబ్బు చేసింది.
అందరూ చనిపోతాడని అనుకున్నారు.అయ్యో!పాపం అతను చనిపోతాడట ఎక్కువరోజులు బ్రతకడటఅని చెవులు కొరుక్కోవటం  మొదలుపెట్టారు.కొంతమంది అతన్ని పరామర్శించటానికి అన్నట్లుగావెళ్ళి మొహంమీదే
సంస్కారం లేకుండా ఇక ఎక్కువ రోజులు బ్రతకవంటగా!అనిఅడగటం మొదలెట్టారు.అయినా అతను అధైర్యపడక సానుకూల దృక్పధంతో ఉండి వైద్యం చేయించుకుని జబ్బునుండి బయటపడ్డాడు.హాయిగా తనపనులుతను చేసుకుంటూ ఎన్నోఘనవిజయలు సాధించాడు.రణబీర్ సానుకూల దృక్పధంతో ఉండబట్టే బ్రతికిబట్ట కట్టగలిగాడు.
ఎన్నోవిజయాలు సాధించి మంచిపనులు చేయగలిగాడు.ఎందరికో సహాయంచేసి అందరి మన్ననలు పొందాడు.
             ఎవరైనా సానుకూలంగా ఆలోచించి చేసినపని తప్పకుండా సాధించగలరు.ప్రతికూలంగా ఆలోచించి
ఈపనిచేయగలనోలేదో  అవుతుందోలేదో అనుకుని ఏపనిచేసినా సాధించలేరు.అందరూ సానుకూలదృక్పధంతో
ఉండి విజయం సాధించండి.