Wednesday 31 August 2016

శ్రమ తక్కువ లాభం ఎక్కువ

                                                        ఎప్పుడూ వంగిపోయి నడవడం,భయంతో చేతులు ముడుచుకున్నట్లు కుర్చీలో కూర్చుంటే మనకు తెలియకుండానే ఒత్తిడి,అందోళనకు గురవుతున్నట్లన్నమాట.ఈ ఒత్తిడి,ఆందోళన దూరం కావాలంటే రోజూ ఏ సమయంలోనైనా,ఎక్కడైనా ఒక 5 ని.లు నిటారుగా భుజాలు తిన్నగా ఉండేలా చేతులు రెండు నడుముపై ఉంచి నిలబడడం,కొంచెం ముందుకు వంగి బల్లపై చేతులు ఉంచి సూటిగా చూస్తూ నిలబడడం,వెన్నెముక పూర్తిగా కుర్చీకి ఆనేలా ప్రశాంతంగా కుర్చీలో కూర్చోవడం చేయాలి.ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తద్వారా ధైర్యంగా ఏ పనైనా చేయగలమని వ్యక్తిత్వ వికాస నిపుణుల ఉవాచ.ఈ పవర్ పోజెస్ చేయాలంటే పెద్దగా కష్టపడాల్సిన పని లేదు కనుక ఏ వయసు వారైనా చేయవచ్చు.వ్యాయామంలో ఇదో కొత్త ఒరవడి.శ్రమ తక్కువ లాభం ఎక్కువ.  


         

Tuesday 30 August 2016

నిస్సత్తువగా ఉన్నప్పుడు......

                                                             ఏదైనా శస్త్రచికిత్స జరిగిన తర్వాత కానీ,జ్వరం వచ్చి తగ్గిన తర్వాత కానీ శరీరంలో శక్తిని పూర్తిగా కోల్పోయినట్లు నిస్సత్తువగా,నీరసంగా,నిరుత్సాహంగా అనిపిస్తుంది.అడుగు తీసి అడుగు కూడా వేయలేనట్లు కొంచెం పని చేసినా ఆయాసం వస్తూ ఉంటుంది.ఈ పరిస్థితి నుండి బయటా పడాలంటే ఒక చిన్న బీట్ రూట్ ముక్క, కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీలో వేసి వడకట్టి దానిలో కొద్దిగా నిమ్మరసం పిండి రోజూ ఒక చిన్నకప్పు రసం తాగాలి.తాగిన కొద్దిసేపటికే కండరాలు శక్తిని పుంజుకుని నిస్సత్తువ తొలగిపోయి ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది.ఇలా కొద్ది రోజులు తాగితే త్వరగా కోలుకుంటారు.

Saturday 27 August 2016

మాడిపోయిన గిన్నె తెల్లగా ....

                                                          ఒక్కొక్కసారి పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోతూ ఉంటాము.గిన్నె నల్లగా మాడిపోయి ఘాటు వాసన వస్తుంటే కానీ గుర్తురాదు.మాడిపోయిన గిన్నె ఒక పట్టాన తెల్లగా రాదు.ఈ రోజుల్లో పని వాళ్ళు కూడా దాన్ని వదిలిద్దామని అనుకోవటం లేదు.సందీప ఇంట్లో పనిమనిషి ఒకసారి వారం రోజులు పోవటం లేదని అలాగే పెట్టింది.చివరకు సందీప కొత్త గిన్నె పడేయటం ఎందుకులే అని కష్టపడి వదిలించింది.తర్వాత రెండుసార్లు వదిలించలేక ఏకంగా గిన్నెలు పడేసింది.సందీప వాళ్ళమ్మతో పాల గిన్నెమాడితే గిన్నెలు చెత్తలో పడేశానని చెప్పింది.మాడిపోయాయని గిన్నెలు పడేయాల్సిన అవసరం లేదు .ఏ పదార్ధం మాడిపోయినా ఆ గిన్నెలో నిండుగా నీళ్ళు పోసి ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసి బాగా మరిగించాలి.ఒక పావు గంట తర్వాత నీళ్ళు పారబోసి కడిగితే తెల్లగా వస్తుంది నేను అలాగే చేస్తాను ఇంక ముందు నువ్వూ కూడా అలాగే చేసి చూడు తేలికగా పోతుంది అని చెప్పింది.

Friday 26 August 2016

నిలువెల్లా గర్వం

                                                                          జానకమ్మ మనుమళ్ళు,మనుమరాళ్ళు అందరూ అమెరికాలో ఉంటున్నారు.జానకమ్మ అక్క సంతానం,మనవ సంతానం కూడా ఉద్యోగ రీత్యా భారతదేశంలోనే వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డారు.అందరూ ఉన్నత స్థానాలలోనే ఉన్నారు.జానకమ్మ మనవరాలి పెళ్ళికి అందరూ తప్పకుండా రావాలని అమెరికా నుండి కూడా అందరూ వస్తున్నారని మరీ మరీ చెప్పింది.చాలా సంవత్సరాల తర్వాత పెళ్ళిలో అందరూ కలిసి మాట్లాడుకోవచ్చని ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు.ఇంతా కష్టపడి వస్తే జానకమ్మ మనవళ్ళు,మనవరాళ్ళు తెల్లారి లేచిన దగ్గర నుండి ముఖ పుస్తకాల్లో ఛాయాచిత్రాలు చూస్తూనే ఉంటారు.ఎదురుగా వున్నవాళ్ళు కూడా ఎవరో తెలియనట్లు ఎవరినీ పలుకరించకుండా ఏటో చూస్తూ పిచ్చి వేషాలు వేస్తున్నారు.అమెరికాలో డాలర్లు సంపాదించుతున్నామని మీకన్నా మేమే గొప్ప అని నిలువెల్లా గర్వంతో విర్రవీగి పోతున్నారు.అక్కడ చిన్న ఉద్యోగం చేసినా,మెతుకు పోతే బతుకు పోతుందేమో అన్నట్లుగా బతికినా ఇక్కడ ఎవరికీ తెలియదులే అనే ధీమా.ఒకవేళ చాలా డబ్బు పోగేసుకున్నా ఎవరికీ వాళ్ళే తింటారు,ఖర్చు పెట్టుకుంటారు.ఎవరికీ ఇవ్వాల్సిన పనిలేదు.ఎప్పుడైనా ఒకసారి కనిపించే బంధువులతో ప్రేమగా ఒక మాట మాట్లాడితే చాలు కదా!దీని భాగ్యానికి చోద్యాలు.పెళ్ళిలో ఇదో పెద్ద చర్చ.మొత్తానికి జానకమ్మ ఒదిన జానకమ్మను అందరిలో అడగనే అడిగేసింది.ఏమిటే ఆ పిల్లలకు అంత మిడిసిపాటు?నువ్వు రావాల్సిందే అన్నావని పనులన్నీ పక్కనపెట్టి వస్తే  ఇదా ప్రతిఫలం అంటూ దులిపేసింది.పాపం జానకమ్మ బిక్కచచ్చిపోయింది.తను మాత్రం ఏమి చేయగలదు.తనదీ అదే పరిస్థితి.బయటకు చెప్పుకోలేదు కదా.!ఇదండీ నేటి కొత్త పోకడ.

Monday 22 August 2016

వేడెక్కిన నీళ్ళు

                                                     మనం బయటకు వెళ్ళినప్పుడు ఏ వాహనాన్ని అయినా ఎక్కడ ఖాళీ వుంటే అక్కడ పెట్టేసి వెళ్తూ ఉంటాము.ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా ఎండలు మండిపోతున్నాయి.ఈ నేపధ్యంలో వాహనంలో పెట్టిన ప్లాస్టిక్ సీసాలో నీళ్ళు వేడెక్కిపోతాయి.తిరిగి రాగానే దాహం వేసి గోరువెచ్చగా అయిన నీళ్ళను తాగుతాము.ఎండలో ఉన్న ప్పుడు ప్లాస్టిక్ సీసా వేడెక్కి  తయారీకి ఉపయోగించిన పదార్ధాలు కరిగి ఆ రసాయనాలు నీళ్ళల్లో కలిసిపోతాయి.ఆ నీటిని మనం తాగటం వలన కాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంది.కనుక ప్లాస్టిక్ సీసాలో వేడెక్కిన నీటిని తాగక పోవటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము.

కొంటె కోణంగి

                                                             సత్యజిత్ మహా కొంటె కోణంగి.చిన్నప్పటి నుండి అన్నీ తుంటరి పనులు చేస్తుండేవాడు.పల్లెల్లో గేదెలు ఈనిన నెల తర్వాత నుండి దూడలు తిరుగుతూ, గెంతులు వేస్తూ పచ్చగడ్డి కొరకటం అలవాటు పడతాయని వాటిని వదిలేసి ఉంచేవారు.పిల్లలందరూ బుజ్జాయి అంటూ దాని వెనుకబడి పరుగెత్తుతూ ఆటలు ఆడేవాళ్ళు.ఐదేళ్ళప్పుడు ఒకసారి సత్యజిత్ ఆడుతూ మధ్యలో పాసు పోసుకోవడానికి వెళ్ళి పోస్తుపోస్తూ దాన్ని తీసికెళ్ళి దూడ నోట్లో పెట్టేశాడు.ఇంతలో పెద్దవాళ్ళు చూచి ఒరే!దూడ కొరికితే చచ్చిపోతావు అంటూ దూడ నోరు తెరిచి పట్టుకుని వాడిని అవతలికి పంపారు.ఇది మచ్చుకి మాత్రమే.అన్నీ ఇటువంటి కొంటె పనులు చేస్తుంటే అందరూ కొంటెగాడు అనటం మొదలెట్టారు.అదే క్రమంగా కొండిగాడు అయ్యాడు.వాడు ఎంత పెద్దయినా అసలు పేరు కన్నా పెద్దవాళ్ళు,దగ్గరి బంధువులు మా కొండిగాడు అనే ఆప్యాయంగా పిలుచుకుంటారు.అలా పిలవొద్దు అంటే చిన్నప్పటి కొంటె పనులు గుర్తు చేస్తారని నవ్వి ఊరుకుంటాడు.  

Saturday 20 August 2016

కిలకిల నవ్వుతూ....

                                                                   అమెరికాలో ఉన్నఐశ్వర్య చిన్నప్పటి నుండి అమాయకంగా లేడిపిల్లలా గెంతుతూ ముఖాన చెదరని చిరునవ్వుతో  సరదాగా సంతోషంగా ఆడుతూ పాడుతూ చదువుకుంటూ గడిపేది.పెళ్ళయి పిల్లలు పుట్టినా ఆ సరదాలు,ముచ్చట్లు పోలేదు. ఐశ్వర్యకు ఒక కొడుకు,కూతురు.ఐదు నెలల కూతురు కూడా ఐశ్వర్య లాగానే ఎప్పుడూ నవ్వుతూ ఏడిపించకుండా ఆడుకుంటుంది.కూతురు పుట్టాక మొదటి రాఖీ పండుగ వచ్చిందని ముచ్చటగా ఐదు నెలల కూతురితో ఐదు ఏళ్ళ కొడుక్కి రాఖీ కట్టించింది.తనకు ఏదో అర్ధమయినట్లు పసిపిల్ల అయినా కిలకిల నవ్వుతూ అమ్మ పట్టుకుంటే అన్నకు రాఖీ కట్టింది.అన్న కూడా ఎంతో బాధ్యతగా చెల్లిని పుట్టినప్పటి నుండి తన చిన్నిఒడిలో పెట్టుకుని ఆడిస్తుంటాడు.అన్నాచెల్లెళ్ళ అనుబంధం అంటే అదేనేమో!వినగానే ముచ్చటేసింది.

నాన్నగా,తాతగా

                                                                      శ్రీహరి మనస్తత్వం అసలు మంచిది కాదు.ఎదుటివాళ్ళు బాగుంటే చూచి తట్టుకోలేడు.ఏదో ఒకటి కుంటి మాటలు మాట్లాడి వాళ్ళను బాధ పెట్టనిదే మనశ్శాంతి ఉండదు.శ్రీహరి పిల్లలు నాన్నగా అని పిలిచేవాళ్ళు.అదే విధంగా మనవరాళ్ళు కూడా తాతగా అని పిలుస్తుంటారు.వయసులో ఉండగా ఉద్యోగం చేసేటప్పుడు బల్ల కింద చేతులు పెట్టి ఎలాగయితే ఒక స్థలం కొన్నాడు.ఆ స్థలం చేజిక్కించుకోవడం కోసం ఇప్పుడు కొత్తగా కూతురికి నాన్నగారు,మనవరాళ్ళకు తాతగారు అయ్యాడన్న మాట శ్రీహరి.ఏనాడూ గౌరవించని అల్లుడికి మామగారయ్యాడు.నేనంటే  గౌరవం పెరిగిందని  శ్రీహరి ఛాతీ వెడల్పు అవుతుందేమో కానీ అదంతా స్థల మహత్యం అని పాపం బయటకు చెప్పుకోలేకపోయినా అతని మనసుకు అర్ధమయ్యే ఉంటుంది.శ్రీహరికి ఇది తగిన శాస్తి అనుకున్నాఏంటో?రక్తసంబంధాలకు కూడా అర్ధం లేకుండా పోతుంది.డబ్బు వస్తుందనుకుంటే గౌరవించడం లేదంటే లేదు.

నాకు ఎప్పుడూ కనిపించలేదే?

                                                                      ఏమండోయ్ ఒకసారి ఇటు రండి మీరు ఎప్పుడయినా ఆకుపచ్చ పావురాల్నిచూశారా?అంటూ అవి తన పక్కనే ఉన్నట్లు వెంటనే రాకపోతే ఎగిరిపోతాయేమో అన్నంత హడావిడిగా రూపాలి భర్తను పిలిచింది.భర్త సాకేత్ కూడా అంతే వేగంగా వచ్చి ఆకుపచ్చ పావురాలా?నాకు ఎప్పుడూ ఎక్కడా కనిపించలేదే?ఎక్కడ ఉన్నాయి?అంటూ హడావిడిగా వచ్చాడు.వాటిని చూడాలంటే మనం ఆఫ్రికా వెళ్ళాల్సిందే?లేకపోతే ఏ జంతు ప్రదర్శనశాలకో వెళ్ళాలి అంటూ ఒక ఛాయాచిత్రం చూపించింది.ఓస్!ఇంతేనా?నీ హడావిడికి నేను నిజంగానే నీ పక్కనే ఉన్నాయేమో చూద్దామని అనుకున్నాను.తీరా చూస్తే బొమ్మ చూపించావు అన్నాడు.ఎంత అందంగా ఉన్నాయో చూడండి అని రూపాలి అంది.అందంగా ఉన్న మాట వాస్తవమే అంటూ సంభ్రమాశ్చర్యాలకు గురై నిజాన్ని ఒప్పుకున్నాడు.వాటిని మీరు కూడా చూడండి.

Friday 19 August 2016

పుణ్య స్త్రీ గా

                                                      కృష్ణ వేణి రమణమ్మ గారింట్లో చిన్నప్పటి నుండి పనిచేసేది.తమ్ముడు అంటే ఉన్న పిచ్చి ప్రేమతో తన ఇద్దరు కూతుళ్ళలో పెద్ద అమ్మాయి సునందను పదిహేను ఏళ్ళకే పాతికేళ్ళవాడికి ఇచ్చి కట్టబెట్టింది.దానికితోడు పిల్లలు పుట్టలేదు.అదీ ఒకందుకు మంచిదే అనుకోవాలి.వాడు వ్యసనాల బారినపడి పక్కా తాగుబోతు,తిరుగుబోతుగా తయారయ్యాడు.వ్యసనపరులకు వచ్చినట్లే వాడికీ హెచ్ ఐ వి వచ్చింది.వాడి వల్ల భార్యకు వచ్చింది.అసలే సునంద అభిమానవతి.వ్యాధి వచ్చిందని తెలిసినప్పటి నుండి తలెత్తుకోలేని పరిస్థితి.ఎవరి ముఖము చూడటానికి కూడా ఇష్టపడలేదు.కనీసం పుట్టింటి ముఖం కూడా చూడలేదు.సునంద భర్తని ఆసుపత్రిలో చేర్చారు.వైద్యులు చివరిదశ అని చెప్పగానే కనీసం పుణ్య స్త్రీ గా నయినా చనిపోవాలని ఎవరికీ చెప్పకుండా ఇంటికి వచ్చి ఉత్తరం వ్రాసి ఉరి వేసుకుని చనిపోయింది.నిండా మూడు పదులన్నా నిండకుండానే తనువు చాలించింది. అయ్యో!ఎవరు చెప్పినా వినకుండా కృష్ణవేణి చదువుకుంటున్న చిన్న పిల్లకు పెళ్ళి చేసి సునంద జీవితం నాశనం చేసిందని రమణమ్మ గారు,చుట్టుపక్కల వాళ్ళే కాక బంధువులు అందరు గొడవ చేశారు.ఇప్పుడు ఎంత మంది అనుకున్నా ప్రయోజనం ఏముంది?చనిపోయిన సునంద ఆత్మ శాంతించాలని అనుకోవటం తప్ప. 
                                                        

Wednesday 17 August 2016

ఆత్మీయత +అనురాగం =రాఖీ పండుగ

                                                         ఒకే చెట్టుకు విరబూసిన పుష్పాల్లా ఒకే కడుపున పుట్టిన సోదరి,సోదరుల ఆత్మీయానురాగాలకు గుర్తుగా నిలిచే పండుగే ఈ శ్రావణ పౌర్ణమి నాడు చేసుకునే రాఖీ పండుగ.ప్రతి సోదరి తన సోదరుడి కుడిచేతికి కట్టే రక్ష అతడికి సకల శుభాల్ని, సర్వ సౌఖ్యాల్ని కలిగిస్తుందని మన నమ్మకం.సహోదరుల ప్రేమాస్పద భావనల మిళితమే రక్షాబంధనం.మనకు రాఖీ పండుగ మాత్రమే తెలుసు కానీ సంతోషీ మాత జన్మదినం,హయగ్రీవ జయంతి,సంస్కృత భాష దినోత్సవం కూడా శ్రావణ పౌర్ణమి రోజే.పలు విశేషాల సమాహారం శ్రావణ పొర్ణమి.నా బ్లాగ్ వీక్షకులు,తోటి బ్లాగర్లు వారి సోదర సోదరీమణులతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నాఈ పండుగను సరదా సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.

Tuesday 16 August 2016

కోపమొస్తుంది

                                                                  సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క వద్ద దీపం పెట్టడం,నీళ్ళు పొయ్యడం,సూర్యాస్తమయ సమయంలో నిద్రపోవడం,తల దువ్వడం,ఇల్లు ఊడవడం వంటి పనులు చేస్తే లక్ష్మీదేవికి కోపమొస్తుంది.ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది.అందుకే మనం సాధ్యమైనంతవరకు ఈపనులు చేయకుండా భక్తితో లక్ష్మీ దేవిని పూజిస్తే ఇంటిలో లక్ష్మీదేవి ఉండి ఇల్లు కళకళలాడుతుంది.

Friday 12 August 2016

కృష్ణవేణి పుష్కర సందడి

                                                                         పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల సందడే సందడి.ఎక్కడెక్కడి నుండో సుదూర ప్రాంతాల నుండి పుష్కర స్నానానికి వచ్చే బంధువులతో కళకళలాడే లోగిళ్ళు,ప్రతి ఒక్క ఇంట్లో ఎవరి వీలునుబట్టి  వాళ్ళు తరతరాల పెద్దలకు పిండ ప్రధానం చేసి ఆ సందర్భంగా ఏదేశంలో ఉన్నా ఆడపడుచులను ఆహ్వానించి దగ్గర బంధువులకు కూడా విందు ఏర్పాటు చేస్తున్నారు.మగపిల్లలు ఆడపడుచులకు బట్టలు పెట్టే సంప్రదాయం ఉండటంతో తన ఆడపడుచు,తండ్రి ఆడపడుచు,బ్రతికి ఉంటే తాత ఆడపడుచులను కూడా పిలిచి బట్టలు పెట్టటంతో షాపులు దగ్గర సందడి.దీనితో రోడ్లు రద్దీతో రోడ్లన్నీ కళకళ.కృష్ణవేణీ నదిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని,స్వయంగా గంగా మాత హంస రూపంలో వచ్చి స్నానమాచరిస్తుంది అని అంటారు కనుకపరమం,పవిత్రం,పావనం అని వీలైనంత వరకు వచ్చిన వాళ్ళందరు పుష్కర స్నానానికి వెళ్ళడంతో నదీతీరంలో ఉన్న గ్రామాల్లో ఒకటే సందడి.స్నానానంతరం దైవదర్శనం ఉత్తమం కనుక గ్రామాల్లో ఉన్న ఆలయాల శోభ ఇంతని వర్ణింపలేనిది.ఇకపోతే కృష్ణాగోదావరి సంగమం వద్ద ఇచ్చే హారతి అత్యద్భుతం,సుమనోహరం.చూడటానికి రెండు కళ్ళు,వర్ణించడానికి ఒక నోరు సరిపోదన్నమాట అతిశయోక్తి కాదు.మొత్తం మీద ఈ పన్నెండు రోజులు సందడే సందడి.అంతర్జాలం పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడున్నా వీక్షించే సదుపాయం ఉండటంతో మన తెలుగు వారందరూ కృష్ణాగోదావరి పుష్కర హారతి పరమాద్భుతమని చూచి తరిస్తున్నారు.  


Wednesday 10 August 2016

అంచు ఉన్న వస్త్రం

                                                                      శుభకార్యాలలో ఎవరికైనా కొత్త వస్త్రాలు పెట్టేటప్పుడు అంచు ఉన్న వస్త్రాలు మాత్రమే పెట్టాలి.ఈ విధంగా చేస్తే పెట్టేవాళ్ళు,పెట్టించుకునేవాళ్ళు కూడా పది కాలాలపాటు చల్లగా ఉంటారు.మాములుగా అయినా అంచు ఉన్న వస్త్రాలు మాత్రమే కట్టాలి.అంచు లేని చీరలు కానీ,పంచలు కానీ కట్టుకోవడం మంచిది కాదు.విడిచిన వస్త్రం అయినా కాలితో తన్నడం కానీ,తియ్యడం కానీ చేయకూడదు.ఎందుకంటే వస్త్రంలో దేవతలు ఉంటారని కనుక కాళ్ళతో తన్నకూడదు అని జేజమ్మ చెప్పటం వల్ల ఈ రోజే తెలిసింది.అందుకే మీకు తెలియచెప్పడం జరిగింది.

Tuesday 9 August 2016

చూపు కోల్పోయే ప్రమాదం

                                                                    విద్యుత్తు బిల్లు తక్కువ వస్తుందని మనందరం ఈమధ్య ఎల్ ఇ డి బల్బులు ఎక్కువగా వాడుతున్నాము కదా!తెల్లగా ఉండే ఈ కాంతిని ఎక్కువగా చూడడం వల్ల కంటిలో ఉన్న రెటీనా దెబ్బతిని చూపు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉందని కంటి వైద్యులు హెచ్చరిస్తున్నారు.శరీరంలో నయనం ప్రధానం అన్నారు పెద్దలు.ఈ బల్బులు ఎక్కువగా వాడి కంటి చూపు కోల్పోయే కన్నా విద్యుత్తు పొదుపుగా వాడుకుని బిల్లు కొంచెం తక్కువ వచ్చేలా ప్రయత్నం చేయడం మేలు.

Saturday 6 August 2016

స్నేహమంటే ఇదేనోయ్

                                                                                    అమ్మ తర్వాత కమ్మనైన పదం స్నేహం.భగవంతుడు అందరికీ తల్లిదండ్రుల్ని,తోడబుట్టిన వాళ్ళను ఇస్తాడు.కానీ స్నేహితులను ఎంపిక చేసుకునేది మాత్రం మనమే.ఎంత మంది స్నేహితులున్నా అందరి అలవాట్లు,అభిరుచులు ఒకేలా ఉండవు.ఎలా ఉన్నా యధాతధంగా స్వీకరించేదే స్నేహం.స్నేహమంటే మధురమైనది.అసలైన స్నేహంలో ఉన్న కమ్మదనం వర్ణింలేనిది. తల్లిదండ్రులతో,స్వంతవారితో కూడా చెప్పుకోలేని విషయాలను తనతో పంచుకోగలిగినప్పుడు కలిగే నిశ్చింత,ప్రశాంతత నిజమైన స్నేహానికి చిహ్నం.అవి మూడో వ్యక్తికి చేరవేయని వారే నిజమైన స్నేహితులు.అటువంటి స్వచ్చమైన మనసుతోపాటు ఒకరు అంటే ఒకరికి నమ్మకం ఉండాలి. అవసరానికి,సరదాగా వచ్చే వంద మంది స్నేహితులు కంటే కష్టం వచ్చినప్పుడు నీకు నేనున్నాను అనే ధైర్యాన్నిచ్చే వాళ్ళు అసలైన స్నేహితులు.ఈరోజుల్లో అంత మంచి ప్రాణ స్నేహితులు దొరకడం కష్టమే అయినా అటువంటి స్నేహితులు ఒక్కరు,ఇద్దరు ఉన్నా వాళ్ళు ధన్యులు.స్నేహానికి విలువ ఇస్తేనే అది కలకాలం నిలుస్తుంది.స్నేహమంటే ఇదేనోయ్ అంటూ స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహం విలువ తెలిసిన అందరికీ నిండు మనసుతో శుభాకాంక్షలు.

Tuesday 2 August 2016

గుండెకు వ్యాయామం

                                                      రోజు 10 నుండి 20 సార్లు మెట్లెక్కి దిగితే గుండెకు మంచి వ్యాయామం అని మనందరికీ తెలుసు.మనందరికీ తెలియని ఇంకొక ఆద్భుతమైన వ్యాయామం చేయటం వల్ల గుండెకు ప్రయోజనంతో పాటు తొడలు,పిరుదులలో ఉండే కొవ్వు కూడా తగ్గిపోతుంది.అదెలాగంటే మనం పరుగెత్తటానికి ముందు ఒక కాలుని ముందుకు పెట్టి ఇంకొక కాలుని వెనక్కు పెట్టినట్లుగా ఎంత సమయం ఉండగలిగితే అంత సమయం ఉండాలి.ఇలా చేయగలిగినన్నిసార్లు కాలు మార్చి కాలు చేస్తుంటే అదనపు కొవ్వు కరిగి ఆరోగ్యంగా ఉంటాము.