Friday 8 September 2017

మిడి మిడి జ్ఞానం

                                                              ఈరోజుల్లో చాలామంది ఎవరికి వారే మాకే అంతా తెలుసు. మేమే గొప్ప.మమ్మల్ని మించిన వారు ఈప్రపంచంలోనే ఎవరూ లేరు అనే అజ్ఞానంతో మిడిమిడి జ్ఞానంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు.స్వార్ధం,అహం పాళ్ళు కూడా ఎక్కువై తమకు తామే బరువుగా తయారు అవుతామని తెలుసుకోవటం లేదు.ముందుగా ఎదుటివాళ్ళు నన్నే పలకరించాలనే అహం.ఒకవేళ తెలిసినవాళ్ళో,బంధువులో మాట్లాడాలని చూచినా చూడనట్లు నటించడం ఎవరైనా అవసరంలోనో,ఆపదలోనో ఉంటే ఇంతకు ముందు వారి సహాయం పొందిఉన్నా కూడా తప్పించుకోవడం ఇలా ఎదుటివారి నుండి ఏదైనా అందుకోవడమే తప్ప అందించడం చేతకాని వారు చివరకు ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఎదురవుతుందని ఊహించరు.వీళ్ళు బయట మాత్రమే ఇలా ఉంటారనుకోవడానికి లేదు.అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ దగ్గర కూడా స్వార్ధం.తోడబుట్టిన వాళ్ళను కూడా ఏమార్చి వాళ్ళ ఆస్తులు అన్యాయంగా కొట్టేసి తన భార్య,తన పిల్లలు తాను మాత్రమే పైకి రావాలనే విపరీత మనస్తత్వం.పోనీ ఇన్ని అక్రమాలు చేసినా ప్రశాంతంగా తనవాళ్ళతో బ్రతుకుతున్నారా!అంటే అదీ లేదు.వాళ్ళతోనే ఛీ కొట్టించుకోవడం మామూలే.శాశ్వతంగా ఈ భూమి మీద బ్రతుకుతారా!అంటే అది సాధ్యం కాదు.దీనివల్ల ఎదుటివాళ్ళు కొంత నష్టపోతారేమో?అంతేకానీ చివరకు వాళ్ళే ఎక్కువ నష్టపోతామని అనుకోరు. మనసులోను,చివరకు తమ చుట్టూ కూడా ఎవరూ లేని ఒంటరి బ్రతుకు బ్రతకాల్సి వస్తుందని కలలో కూడా ఊహించరు.వాళ్ళు సంతోషంగా ఉండరు.ఎదుటివాళ్ళు సంతోషంగా ఉన్నా తట్టుకోలేరు.మనం సంతోషంగా ఉండాలి.మన చుట్టూ ఉన్నవాళ్ళను సంతోషంగా ఉండేలా చేయాలి.అప్పుడే మనకు మనశ్శాంతి అని జ్ఞానోదయం చేద్దామని ఎవరైనా అనుకున్నా నువ్వు చెప్పేదేమిటి?నాకు తెలుసు అనే అహం.ఇన్ని తెలిసినా స్వార్ధం,అహం,భేషజాలు వదులుకోలేకపోవడం దురదృష్టకరం.ఈ అహం,స్వార్ధం,భేషజం అనే  అజ్ఞానం నుండి బయటపడి ఎప్పుడైతే జ్ఞానోదయం కలుగుతుందో అప్పుడు వాళ్ళతోపాటు అందరికీ సంతోషం.

No comments:

Post a Comment